పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1
ములుగు జిల్లా తాడ్వాయి–పస్రా జాతీయ రహదారిపై సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పర్వతగిరి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు నూనావత్ శక్రూ, కైకాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరామర్శించారు.హనుమకొండలోని సంకీర్తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం బాధితుల కుమారుడు గణేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ధైర్యం చెప్పారు. ప్రమాదంతో ఆందోళనలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ, తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదం కారణంగా కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కల్లెడ పాక్స్ చైర్మన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి పాక్స్ చైర్మన్ అత్తి కుమారస్వామి, పెద్దతండ సర్పంచ్ వీరన్న, నాయకులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




