జయంతి వేడుకలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి
పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, అక్టోబర్ 22 : అణగారిన, బడుగు బలహీన వర్గాల వారి కోసం పండుగ సాయన్న కనబరచిన ధైర్య సాహసాలు, చూపిన తెగువ అందరికీ స్పూర్తిదాయకం అని రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నరూ. పండుగ సాయన్న 174వ జయంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంత్ రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొని పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పండుగ సాయన్న ఒక వ్యక్తిగా కాకుండా మహాశక్తిగా మారి ఆనాటి భూస్వాములు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీరుడు అని కొనియాడారు. సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి పోరాటం సాగించిన సాయన్న సాహసం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన కేవలం ఒక్క ముదిరాజ్ వర్గానికే కాకుండా అన్ని వర్గాల వారికి ఆరాధ్యుడని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బీ.సీలకు జనాభా నిష్పత్తి మేరకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు కుల గణన జరిపించిందని, కేంద్రం ఆమోదం తెలుపనప్పటికీ స్థానిక సంస్థల్లో బీ.సీలకు మున్సిపల్ మేయర్, చైర్మన్ పదవులను 53 శాతం కేటాయించబడేలా చూశామన్నారు. ముదిరాజ్ లు రాజ్యాధికార సాధన దిశగా పండుగ సాయన్న స్పూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, భూస్వాములు, జమిందార్ల ఆగడాలు హెచ్చు స్థాయిలో ఉన్న ఆనాటి రోజుల్లోనే పండుగ సాయన్న వారికి వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాల వారి కోసం చేసిన పోరాటం ఎంతో గొప్పదని అన్నారు. ఆయన స్పూర్తితో నేటి తరం వారు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యతోనే అన్ని రంగాలలో రాణించడం జరుగుతుందని, భావితరాలకు చక్కటి భవిష్యత్తును అందించేందుకు, వారి హక్కులను వారు సాధించుకునేందుకు బాలబాలికలు అందరిని తప్పనిసరిగా చదివించాలని పిలుపునిచ్చారు. మహనీయులను స్మరించుకుంటూ, వారి స్పూర్తితో సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపాడాలనే సదాశయంతో ప్రభుత్వం మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ క్రమంలో పండుగ సాయన్న జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జిల్లా బీ.సీ సంక్షేమ శాఖ అధికారి సాయికుమార్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, బి.రామకృష్ణ, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు కే.రమేష్, మెతుకు శివ, రవిరాజ్, నారాయణ, బీ.సీ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.




