పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 22:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బల్దియా కమిషనర్ టి. వెంకన్న నేడు ఒక ప్రకటనలో తెలిపారు.నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, భద్రత, రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జి డబ్ల్యూ ఎం సి పరిధిలో సుమారు 8 వేల విగ్రహాలను నిమజ్జనం చేయుటకు గాను హన్మకొండలోని బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని భీమారం చెరువు, హసన్‌పర్తిలోని పెద్ద చెరువు, ఖాజీపేటలోని పరిగి కుంటతో పాటు వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి, ఉడుసుగుట్ట, రంగాసముద్రం, రంగశాయిపేట, మామునూరు బేస్తం చెరువు, గీసుకొండలోని కట్టమల్లన్న చెరువు తదితర నిమజ్జన కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు, దీనికి తోడుగా చిన్నచిన్న చెరువులలో కూడా చిన్న విగ్రహాలు వేయుటకు ఏర్పాటుచేసినట్లు కమిషనర్ తెలిపారు.వినాయక విగ్రహాలు నిమజ్జన కేంద్రాలకు సురక్షితంగా చేరుకునేలా ప్రధాన రహదారుల్లోని గుంతలను పూడ్చడంతో పాటు, రహదారుల వెంట ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించినట్లు తెలిపారు. నిమజ్జన కేంద్రాల పరిసరాల్లో బుష్ కటింగ్, పారిశుద్ధ్య పనులు, చెరువుల్లో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.బల్ది ఆధ్వర్యంలో 500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
నిమజ్జన సమయంలో భారీ విగ్రహాలను చెరువుల్లోకి తరలించేందుకు 30 క్రేన్లను అందుబాటులో ఉంచామని, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వివిధ నిమజ్జన కేంద్రాల వద్ద 145 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు కమిషనర్ వెల్లడించారు. భక్తులు నీటిలోకి వెళ్లకుండా అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు, తెప్పలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
—ప్రత్యేక అధికారులకు బాధ్యతలు…
నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు బల్దియా సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్‌ను ఓవరాల్ ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు కమిషనర్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంతోష్ బాబును వరంగల్ ప్రాంతానికి, రవి కుమార్‌ను హన్మకొండ ప్రాంతానికి ఓవరాల్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్‌కు అండర్ రైల్వే జోన్, ఉరుసుగుట్ట, అగర్తల చెరువుల నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద డీఈ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏఈలు, కార్యాలయ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆయా కేంద్రాల్లో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి, పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టేలా బాధ్యతలు కేటాయించినట్లు వివరించారు.
వివిధ శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు…
నిమజ్జన కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుద్దీకరణ, ప్రధాన కూడల్లో మంచినీటి సదుపాయం, రాకపోకలు, బారికేడింగ్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు బల్దియా అధికారులు, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, రోడ్లు భవనాల, మత్స్య ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖలు, గణేష్ ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. నిమజ్జన కేంద్రాల్లో పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, సురక్షితంగా, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా నిర్వహించేందుకు భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు బల్దియా, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కమిషనర్ టి. వెంకన్న కోరారు. నిమజ్జన సమయంలో అధికారులు సూచించే భద్రతా నిబంధనలు పాటిస్తూ, ప్రజలందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



