పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17
హనుమకొండ: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసే నాయకులను ప్రజలు ఆదరించాలని, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించకూడదని ఆయన పిలుపునిచ్చారు.శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అర్హత పొందిన 210 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను, మరో 150 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం రూ.1,55,00,000 (రూ.1 కోటి 55 లక్షలు) విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబం కల అని, ఆ కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, పేదల సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో KUDA చైర్మన్ గుండు సుధారాణి,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు,అధికారులు, కార్యకర్తలు,లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




