పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ఆపన్నులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి ఆర్థిక సహాయం అందించి, మెరుగైన వైద్యం పొందేలా చొరవ తీసుకోవడంతో పాటు, కోలుకోని ఇంటికి చేరిన యువకుడిని స్వయంగా పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మంద మల్లేశం – రాధిక దంపతుల కుమారుడు కార్తిక్ తీవ్ర అనారోగ్యానికి గురై హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొన్ని రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి కార్తిక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించడంతో పాటు, చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
––కార్తిక్ ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబంలో ఆనందం….
ఎమ్మెల్యే గారు చూపిన చొరవతో పాటు వైద్యుల చికిత్సతో కార్తిక్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు కార్తిక్ నివాసానికి వెళ్లి యువకుడిని ఆప్యాయంగా పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కార్తిక్‌కు సూచిస్తూ మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. కార్తిక్ ఆరోగ్యంగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
—-ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే…
ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే మానవతా దృక్పథంతో అవసరమైన వారికి సహాయం అందిస్తూ భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు.కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సహకరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి కార్తిక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోశాల వెంకటేశ్వర్లు,ఇల్లంద రాజరాజేశ్వర స్వామి దేవాలయం చైర్మెన్ బుచ్చిమల్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమ్మయ్య గౌడ్, మల్లెపాక సమ్మయ్య, సాయిలు, గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




