Thursday, October 22, 2026
Home Politics –ప్రత్యేకంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి…...

–ప్రత్యేకంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి… –జీవో నెం. 48 ద్వారా 22.03.2025 తేదీ రోజున ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు ఇచ్చింది….  –స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

0
33

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని రాష్ట్రంలోనే మంచి పేరున్న విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య, ల్యాబొరేటరీలు, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మాట్లాడుతూ.… రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న పరిస్థితుల్లో ఘనపూర్‌లో కొత్త డిగ్రీ కాలేజీ అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పటికీ, ఇది తన ఎన్నికల హామీ అని, స్థానిక పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట పడి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించానని తెలిపారు. ముఖ్యమంత్రి  తనపై ఉన్న నమ్మకంతో ప్రత్యేకంగా ఘనపూర్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేసిందని చెప్పారు. 2025 మార్చి 22న జారీ చేసిన జీవో ద్వారా డిగ్రీ కాలేజీకి మొత్తం రూ.8.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో సుమారు రూ.2.50 కోట్లు ఉద్యోగుల జీతాలు ఇతర అవసరాలకు, రూ.6.10 కోట్లు భవన నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.డిగ్రీ కాలేజీ భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. 2027 ఆగస్టు 1 నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందించాలని తెలిపారు. పనుల్లో ఆలస్యం లేకుండా అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. భవన నిర్మాణంతో పాటు విద్యార్థులకు అవసరమైన ల్యాబొరేటరీలు, లైబ్రరీ, ఇతర సౌకర్యాలను కూడా త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.23 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. అవసరమైన ఇతర ల్యాబ్‌లు, లైబ్రరీ పుస్తకాలు కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం భవనాలు, వసతులు కల్పించడం మాత్రమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అత్యంత ముఖ్యమని అన్నారు. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ మెరుగ్గా ఉంటే విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు.తాను చిన్నతనంలో కష్టపడి చదువుకున్నానని, విద్య తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్ల తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. ప్రభుత్వం అందించే రాయితీలు, పథకాల కంటే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం మరింత ముఖ్యమని అన్నారు. మెరుగైన విద్య అందిస్తే పేద విద్యార్థులు కూడా ఇతరులతో సమానంగా పోటీ పడగలరని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విద్యా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా రూ.9.90 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చిల్పూర్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరైందని, దాని నిర్మాణానికి కూడా త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు చెప్పారు.ప్రైవేట్ విద్యాసంస్థలతో పోలిస్తే ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, అకాడమిక్ ప్రమాణాలు, క్రమశిక్షణను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఘనపూర్ డిగ్రీ కాలేజీ భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. కాలేజీకి అవసరమైన నీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతులను మున్సిపాలిటీ తరఫున కల్పించాలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని నాణ్యమైన విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధికారులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఈఈ అరుణ్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, మున్సిపల్ కమిషనర్ రాధక్రిష్ణ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.