Friday, September 25, 2026
Home Politics కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డిగారిని కలిసిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య—కేంద్రంతో...

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డిగారిని కలిసిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య—కేంద్రంతో మాట్లాడి వరంగల్‌కు నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలని సీఎంకు విజ్ఞప్తి..

0
11

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్

వరంగల్‌ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గారిని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉషా నిధుల మంజూరు, వరంగల్‌ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర నిధులు, వరంగల్‌లో నైలిట్‌ (NIELIT), సీఐటీడీ (CITD) కేంద్రాల ఏర్పాటు, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం (PSK) ఏర్పాటు అంశాలను ముఖ్యమంత్రికి ఎంపీ వివరించారు.

—కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉషా నిధులు:

కాకతీయ యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు పీఎం-ఉషా పథకం కింద ప్రతిపాదించిన నిధులను కేంద్రం నుంచి త్వరగా మంజూరు చేసి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యా, పరిశోధన, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, పరిశోధకులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.

—పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు..

వరంగల్‌ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రూ.10 కోట్లు మంజూరు చేయించేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి గారిని ఎంపీ కోరారు. 1991లో ఏర్పాటు చేసిన ప్రస్తుత మ్యూజియం భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త మ్యూజియం భవన నిర్మాణం 2023 మేలో పూర్తయినప్పటికీ కళాఖండాల తరలింపు, పరిరక్షణ, ప్రదర్శన వసతులు, భద్రత, వాతావరణ నియంత్రణ తదితర పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. 2026–31కు సంబంధించిన సవరించిన మ్యూజియం గ్రాంట్‌ పథకం మార్గదర్శకాలు వెలువడిన అనంతరం ప్రతిపాదన సమర్పించాల్సి ఉన్నందున, ఆ మేరకు కేంద్రంతో సమన్వయం చేయాలని కోరారు.

–వరంగల్‌లో నైలిట్‌ కేంద్రం:

వరంగల్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే ఉన్న ఈ సంస్థకు వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తే వరంగల్‌తో పాటు పరిసర జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, A I, సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ తదితర రంగాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన శిక్షణ, ధ్రువపత్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

—సీఐటీడీ ఏర్పాటుకు విజ్ఞప్తి..

వరంగల్‌లో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (CITD) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు. ఇంజినీరింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన యువత, ఎంఎస్‌ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. టూల్‌ అండ్‌ డై డిజైన్‌, సీఎడీ/సీఏఎం, సీఏన్‌సీ మిషనింగ్‌, మౌల్డ్‌ తయారీ, ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, 3డీ ప్రింటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సాంకేతిక సహకారం లభిస్తుందని వివరించారు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖతో సంప్రదించి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

–పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలి..

వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం (POPSK) స్థానంలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం (PSK) ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. 2017 మార్చి 29న ఏర్పాటు చేసిన POPSK ద్వారా ప్రాంత ప్రజలకు సేవలు అందుతున్నాయని, పాస్‌పోర్ట్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోందని తెలిపారు. తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ సేవల కోసం కరీంనగర్‌, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. వరంగల్‌-హనుమకొండ-కాజీపేట త్రినగర ప్రాంతంతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తగిన మౌలిక వసతులు, సిబ్బందితో పూర్తిస్థాయి PSK ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడాలని ముఖ్యమంత్రిని ఎంపీ కోరారు.వరంగల్‌ ప్రాంత విద్యార్థులు, యువత, పరిశోధకులు, ప్రజలకు మెరుగైన విద్య, నైపుణ్య, సాంకేతిక, కేంద్ర ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించే చర్యలకు కేంద్ర సహకారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చొరవ చూపాలని వరంగల్ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు. అలాగే వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయా ప్రతిపాదనలపై సంబంధిత శాఖలతో చర్చించి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.