పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 22:
బుధవారం వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటన లో పేర్కొన్నారు.నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే నిమజ్జన ఏర్పాట్లకు అధికారులను షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించడం జరిగిందని,చిన్న వడ్డేపల్లి, కట్ట మల్లన్న చెరువు–గోర్రెకుంట, అగర్తల చెరువు, ఉర్సుగుట్ట, బెస్తం చెరువు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. అలాగే మదన్నపేట నర్సంపేట, దుగ్గొండి చెరువు, పాకాల చెరువు, కొల్లకుల చెరువు చెన్నరావుపేట, గురిజాల పెద్ద చెరువు, నల్లబెల్లి పెద్ద చెరువు, రంగాయి చెరువు, నెక్కొండ చెరువు, చంద్రుగొండ కుంట, కోనారెడ్డి ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనూ అధికారులు విధులు నిర్వహించనున్నారు.నిమజ్జన ప్రాంతాల్లో ఈతగాళ్లు, పడవలు, 108 అత్యవసర సేవలు, వైద్య బృందాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబధిత అధికారులను ఆదేశించారు.అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లు, ఆపరేటర్లు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, సివిల్ డిఫెన్స్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.అన్ని నిమజ్జన కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, డీజిల్, నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో తప్పనిసరిగా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు మొత్తం నిమజ్జన ఏర్పాట్లకు సూపర్‌వైజర్లుగా వ్యవహరిస్తూ అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.




