-అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి….
-బతుకమ్మ పండుగ సందర్బంగా అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 20వరకు కాలువలలో నీళ్లు ఉండాలి….
-అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 జనగామ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా ఇప్పటికే మంజూరై, చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శాఖల వారీగా ఇప్పటికే మంజూరైన పనులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనుల వివరాలపై క్షుణ్ణంగా చర్చించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం విషయంలో ఈసారి వర్షపాతం తక్కువగా ఉన్నందున రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. నీటి ఆధారిత పంటలకు బదులుగా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులకు అర్థమయ్యే రీతిలో సున్నితంగా వివరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతుల పంటలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం, డ్రిప్ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో పని చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 8 సబ్ స్టేషన్లలో 3 సబ్ స్టేషన్ల పనులు పూర్తి కాగా, మిగిలిన సబ్ స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. వీబి జీరామ్ జీ పథకం కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సమాఖ్య సంఘం (VO) భవనాలను త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలను నిర్దేశించిన వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కాలువల శుభ్రత పనులను చేపట్టి, చెరువులు, కుంటలు, ట్యాంకులు నిండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల ప్రహరీ గోడలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వీబి జిరామ్ జీ కింద చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో లోపు పూర్తి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో స్టేషన్ ఘనపూర్, జనగామ ఆర్డీవోలు కిరణ్ ప్రకాష్, భాస్కర్, డీఏఓ అంబికా సోనీ, నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, సంబంధిత శాఖల డిఈలు, ఏఈలు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




