Friday, September 11, 2026
Home Sports ఖేలో ఇండియా పథకానికి జ్వాలా గుత్తా మద్దతు

ఖేలో ఇండియా పథకానికి జ్వాలా గుత్తా మద్దతు

0
31

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ హైదరాబాద్:పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి మద్దతు తెలిపిన ఒలింపియన్ జ్వాలా గుత్తా
• క్రీడారంగాన్ని మార్చే ఈ పథకం ఎప్పుడో రావాల్సింది: జ్వాలా గుత్తా
• 2026 – 31 సంవత్సరాల కాలానికి పునరుద్ధరించిన పథకానికి గతంలో కంటే 8 రెట్లు అదనంగా రూ.29,054 కోట్ల నిధుల కేటాయింపు – ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యం
• కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్య నమూనాగా ఖేలో ఇండియా పథకం – క్రీడాకారులను కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే ప్రక్రియకు అనుగుణంగా నిధుల కేటాయింపు
• పునరుద్ధరించిన పథకం కింద 30 క్రీడాంశాల్లో 10,000 మంది ఖేలో ఇండియా అథ్లెట్లకూ, 20,000 మంది ఖేలో ఇండియా వర్ధమాన అథ్లెట్లకూ ప్రోత్సాహం
హైదరాబాద్, ఆగస్టు 21: పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం భారత క్రీడారంగం రూపురేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న (2012 లండన్, 2016 రియో) క్రీడాకారిణి, ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పతక విజేత జ్వాలా గుత్తా అన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం క్రీడారంగంలో పెనుమార్పు తీసుకొచ్చే గేమ్‌ చేంజర్‌గా నిలుస్తుందని, చాలా కాలం క్రితమే ఈ పథకం రావాల్సిందని ఆమె పేర్కొన్నారు.
జ్వాలా గుత్తాతో పాటు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏటీఎస్) వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ. సోనిబాలా దేవి, బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) ప్రాంతీయ డైరెక్టర్‌ శ్రీ విష్ణు సుధాకరన్‌, ఢిల్లీలోని ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీమతి ఎస్. హిమబిందు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీమతి హిమ బిందు మాట్లాడుతూ, ఖేలో ఇండియా పథకంలోని కీలక అంశాలను, తెలంగాణ వంటి రాష్ట్రంపై ఈ పథకం చూపించే ప్రభావాన్ని వివరించారు. 2026–31 కాలానికి అమలయ్యే ఈ పథకానికి గత కేటాయింపుతో పోలిస్తే 8 రెట్లు పెంచి రూ.29,054 కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను 10 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
“ఈ పథకం కింద క్రీడల్లో అట్టడుగు స్థాయి నుంచి ఒలింపిక్‌ స్థాయి ప్రతిభకు చేరుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. వ్యవస్థలోని లోటుపాట్లను ఈ పథకం పరిష్కరిస్తుంది. కోచ్‌లతో బోర్డును ఏర్పాటు ద్వారా చిన్నారుల క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరచేందుకు అవకాశం ఉంటుంది. అకాడమీల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి” అని శ్రీమతి హిమబిందు తెలిపారు.
తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 33 ఖేలో ఇండియా కేంద్రాలను మంజూరు చేశారు. వీటిలో మాజీ ఛాంపియన్‌ క్రీడాకారులు 601 మందికి పైగా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. మేడ్చల్‌ – మల్కాజ్‌గిరిలో ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కూడా ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో రోయింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఫెన్సింగ్‌ తదితర క్రీడాంశాల్లో మొత్తం 254 మంది క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందుతోంది. వీరిలో 152 మంది పురుషులు, 102 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.రాష్ట్రంలో అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, సైక్లింగ్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడాంశాల్లో మొత్తం 19 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలను ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. మహిళల కోసం క్రీడల (స్పోర్ట్స్ ఫర్ ఉమెన్) విభాగం కింద తెలంగాణలో 127 అస్మిత లీగ్‌లు నిర్వహించగా, వీటిలో 20,921 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు.
…..గుత్తా ఇలా అన్నారు: “నేనూ ప్రభుత్వ అండతోనే ఎదిగాను. ప్రభుత్వ మద్దతు లేకుండా ఒక క్రీడాకారిణిగా నేను సాధించినదంతా సాధ్యమయ్యేది కాదు. కొత్త రూపంలోని ఈ ఖేలో ఇండియా పథకం చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి సారించడంతో, పిల్లలను క్రీడలకు పంపడాన్ని తల్లిదండ్రులు చాలా సురక్షితంగా భావిస్తారు. క్రీడలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూనే ఉంది. ఇది ఈ రంగంపై గణనీయ ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం కూడా అపారంగా ఉంటుంది. ఈ పథకంతో అనుబంధం ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.’ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలు’, ‘ఫీడర్ పాఠశాలలు’, ‘ఖేలో ఇండియా కేంద్రాల’ ద్వారా ఒక ప్రామాణికమైన, శాస్త్రీయమైన, సాంకేతికతతో కూడిన ప్రతిభా గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం కేఐఎస్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ విధానం ‘ఖేలో ఇండియా అథ్లెట్లు’, ‘వర్ధమాన ఖేలో ఇండియా అథ్లెట్లు’ (ఇ-కేఐఏ) అనే విభాగాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంపై కేఐఎస్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ దార్శనికతలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను తెలంగాణ నిర్వహించనుంది. ఖేలో ఇండియా స్కీమ్‌లో ప్రతిభను మెరుగుపరచడం, అథ్లెట్ల నిలుపుదల, అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పరివర్తన, సంస్కరణ-ఆధారిత విజయాల ఆధారంగా నిధులు అందించే నిబంధనతో… కేంద్ర-రాష్ట్రాల సహకార నమూనా సదుపాయం అందుబాటులో ఉంది.”తెలంగాణ వంటి రాష్ట్రానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం దీర్ఘకాలిక ప్రణాళికా రచనకు తోడ్పడుతుంది. క్రీడలను ఒక అంశంగా పరిగణించే రాష్ట్రాల విధానంపై ఈ దార్శనికత గణనీయ ప్రభావం చూపుతుంది. క్రీడలను విద్యా విధానంతో అనుసంధానిస్తున్న క్రమంలో, మనం మరింత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు” అని డాక్టర్ సోనిబాలా దేవి అన్నారు. ఖేలో ఇండియా పథకాన్ని ఇంకా మెరుగుపరుస్తున్నట్లు శ్రీ సుధాకరన్ అన్నారు. “ఈ పథకం ఎలా పనిచేస్తుంది, రాష్ట్రాలు దీనిలోని కీలక అంశాలను ఎలా స్వీకరిస్తాయి అనే విషయాలను కార్యాచరణ మార్గదర్శకాలు వివరిస్తాయి. గతంలో మేం పరిమిత బడ్జెట్లతో ‘కేంద్రీకృత’ విధానాన్ని అనుసరించేవాళ్లం. ఈ ఖేలో ఇండియా పథకం, భాగస్వాములందరితో జరిపిన విస్తృత చర్చల ఫలితమే. ఇది అందరికీ ప్రయోజనకరం. క్రీడా ఉద్యమాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న ‘ఖేలో భారత్ నీతి’ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ కేటాయించారు” అని ఆయన అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.