పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడం, వచ్చిన అధికారుల వద్ద కూడా అరకొర సమాచారమే ఉండటం పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశా కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై, వివిధ శాఖల పనితీరుపై అధికారులను నిలదీశారు.హన్మకొండ, వరంగల్, కాజీపేట (ట్రై సిటీ) పరిధిలో రోజుకు ఎన్ని టన్నుల కూరగాయలు అవసరం…? అందులో మన స్థానిక రైతులు ఎంత ఉత్పత్తి చేస్తున్నారు…? అనే విషయాలపై వ్యవసాయ శాఖ అధికారులకు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ట్రై సిటీ చుట్టుపక్కల గ్రామాలు, మండలాల్లో కూరగాయల సాగుకు పెద్దపీట వేసి ప్రోత్సహించాలని సూచించారు. ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై తగిన అవగాహన కల్పించాలని ఆదేశించారు.నేషనల్ హైవే అధికారులు రోడ్డు భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగారు. ధర్మసాగర్, ఉనికిచర్ల అండర్ పాస్‌ల వద్ద కనీస భద్రతా సూచికలు, జీబ్రా లైన్లు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు అండర్ పాస్‌లు, రోడ్ క్రాసింగ్‌లు, యు-టర్న్‌ల వద్ద తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని, నెల రోజుల్లో ధర్మసాగర్ PHC పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని స్పష్టం చేశారు. కలెక్టర్, DMHOలు వెంటనే ఈ ఆసుపత్రిని తనిఖీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అసంపూర్తిగా మిగిలిపోయిన హెల్త్ సబ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయో వివరాలు సమర్పించాలని అన్నారు.హన్మకొండ జిల్లాకు ఎన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు… ఎన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు మంజూరయ్యాయి…? వాటి నిర్మాణ పనుల పురోగతి ఏ దశలో ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మ్యాథ్స్, ఇంగ్లీష్లలో సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి, ఈసారి టెన్త్ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. విద్యా రంగంపై కలెక్టర్ ప్రతి నెలా సమీక్ష జరపాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.దిశా కమిటీ సమావేశం చాలా బాధ్యతాయుతమైనదని, ఇందులో చర్చించిన అంశాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎంపీ ద్వారా నేరుగా లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్డీవో వెంకటేష్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




