Tuesday, November 3, 2026
Home People జూదం, పేకాట కట్టడికి 4 ప్రత్యేక పోలీసు బృందాలు

జూదం, పేకాట కట్టడికి 4 ప్రత్యేక పోలీసు బృందాలు

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి  : జిల్లాలో జూదం, పేకాట కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టే లక్ష్యంతో జిల్లా ఎస్పీ  నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ జిల్లావ్యాప్తంగా జూదం నిర్వహించే ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేస్తాయి. ముందస్తు సమాచారాన్ని సేకరిస్తూ ఎక్కడైనా జూదం, పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాలకు చేరుకొని ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయి. జూదం నిర్వాహకులు, పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కష్టపడకుండా తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో జూదం (పేకాట)కు అలవాటుపడుతున్న కొందరు తమ జీవితాలను, కుటుంబాల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని తెలిపారు. జూదంలో గెలిచి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమతో కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఈ వ్యసనం కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. జూదం సంపాదనకు మార్గం కాదని, జీవితాలను చిన్నాభిన్నం చేసే వ్యసనమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా యువత క్షణికమైన ఆశలకు, అత్యాశకు లోనై జూదానికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం(పేకాట) కేసుల్లో పట్టుబడి కేసులు నమోదైతే అవి పోలీసు రికార్డుల్లో నమోదవుతాయని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జరిగే పోలీసు వెరిఫికేషన్‌లో గత కేసుల వివరాలు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని, తద్వారా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడవచ్చని హెచ్చరించారు. కేసుల దర్యాప్తులో చట్టప్రకారం వేలిముద్రలు సేకరించి పోలీసు రికార్డుల్లో భద్రపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. క్షణిక ఆనందం కోసం భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని యువతకు సూచించారు.జిల్లాలో ఎక్కడైనా జూదం, పేకాట ఆడుతున్నా లేదా నిర్వహిస్తున్నా ఉపేక్షించేది లేదని, అటువంటి కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం(పేకాట) నిర్వహిస్తున్నట్లు గుర్తించినా లేదా సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712686133 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. జూదం, పేకాట నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములై పోలీసులకు సహకరించాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలకు, సమాజానికి మంచి భవిష్యత్తును అందించాలని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు.జూదానికి దూరంగా ఉండండి.. కుటుంబాలను కాపాడుకోండి.. యువత బంగారు భవిష్యత్తును పదిలంగా ఉంచుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.