జిడబ్ల్యూఎంసీ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28
వరంగల్ నగరాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో, సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ సమక్షంలో బుధవారం ఎన్‌ఐటీ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి కలిసి ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ద్వారా ఎన్‌ఐటీ వరంగల్‌లోని విద్యా, పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలను నగర అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ పట్టణ ప్రణాళిక, పర్యావరణహిత అభివృద్ధి వంటి రంగాల్లో సాంకేతిక సలహాలు, వినూత్న పరిష్కారాలను అన్వేషించనున్నారు. జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు, వివిధ విభాగాల అధికారులకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ఉద్యోగులకు ఉన్నత విద్యావకాశాలను పరిశీలించనున్నారు.-జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ…. నగరాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నిపుణుల సూచనలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ విద్యాసంస్థల పరిజ్ఞానాన్ని పట్టణ పరిపాలనతో అనుసంధానం చేయడం ద్వారా నగర సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనవచ్చన్నారు. ఈ భాగస్వామ్యాన్ని సమర్థంగా వినియోగించుకొని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మరింత నాణ్యమైన పౌర సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు.వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ… విద్యాసంస్థలు, పట్టణ స్థానిక సంస్థల మధ్య సమన్వయం బలోపేతం కావడం ద్వారా నగర అభివృద్ధికి అవసరమైన వినూత్న పరిష్కారాలను రూపొందించవచ్చని అన్నారు. ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ…. ఎన్‌ఐటీ వరంగల్‌తో కుదిరిన ఈ ఒప్పందం నగర అభివృద్ధికి సాంకేతికంగా మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. నగరంలో ఎదురయ్యే పట్టణ సమస్యలకు శాస్త్రీయ, సాంకేతిక పరిష్కారాలను అన్వేషించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందన్నారు. మున్సిపల్ ఇంజినీర్లు, అధికారులు, సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పనితీరును మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ఎన్‌ఐటీ నిపుణుల సలహాలు, పరిశోధన ఫలితాలను అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించుకొని, పనుల నాణ్యతను పెంచుతూ పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఎన్‌ఐటీ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రతీష్ కుమార్ కూడా ఈ భాగస్వామ్యాన్ని స్వాగతించారు.జీడబ్ల్యూఎంసీ పరిపాలనా అనుభవం, ఎన్‌ఐటీ వరంగల్ సాంకేతిక నైపుణ్యం కలిసివచ్చే ఈ భాగస్వామ్యం నగర మౌలిక సదుపాయాల బలోపేతం, ఉద్యోగుల సామర్థ్య పెంపు, సమర్థవంతమైన పట్టణ నిర్వహణకు దోహదపడనుంది. పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా అవసరాలను సమన్వయం చేస్తూ వరంగల్ నగరాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఒప్పందం కీలక అడుగుగా నిలవనుంది. ఎన్‌ఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్. శంకర్, ప్రొఫెసర్ ఎం. శశి ఈ ఒప్పందం రూపకల్పన, సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్కుమార్ సీఎంహెచో డాక్టర్ రాజారెడ్డి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్ జనార్దన్, అకౌంట్స్ ఆఫీసర్ శివ లింగం అన్ని విభాగాల అధికారులు ఎన్‌ఐటీ వరంగల్ విభాగాధిపతులు, డీన్లు, సీనియర్ విద్యా, పరిపాలనా అధికారులు, జీడబ్ల్యూఎంసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




