Friday, October 23, 2026
Home Politics —శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా ఎందుకు వచ్చారు–అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య...

—శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా ఎందుకు వచ్చారు–అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆగ్రహం…

0
21

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారంతో దిశా సమావేశానికి హాజరుకావాల్సిన అధికారులు పూర్తి వివరాలు లేకుండా రావడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, వచ్చే సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షేమం, రహదారులు, పురావస్తు తదితర శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని ఎంపీ సమీక్షించారు. పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

—సమగ్ర సమాచారంతో ఎందుకు రాలేదు….

కొన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా అధికారులు సమావేశానికి హాజరుకావడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా దిశా సమావేశానికి ఎందుకు వచ్చారు?” అని అధికారులను ప్రశ్నించారు. ఇకపై సమావేశానికి వచ్చే ప్రతి అధికారి తన శాఖకు సంబంధించిన పథకాల అమలు, పురోగతి, ఖర్చులు, పెండింగ్ పనులు, సమస్యలు, తదుపరి చర్యలపై పూర్తి సమాచారంతో రావాలని సూచించారు.దిశా సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి హాజరుకాకుండా ఇతర అధికారులు రావడంపై కూడా ఎంపీ ఆరా తీశారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారి ఎందుకు హాజరుకాలేదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

తదుపరి సమావేశానికి పూర్తి వివరాలతో రావాలి….

“వచ్చే దిశా సమావేశానికి ప్రతి శాఖ అధికారులు తమ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలి. కేంద్ర పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి? ఎంత నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు? ఏ పనులు పూర్తయ్యాయి? ఏవి పెండింగ్‌లో ఉన్నాయి? సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే వివరాలు స్పష్టంగా ఉండాలి” అని ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు.కేంద్ర పథకాల అమలు పురోగతిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. DISHA కమిటీ లక్ష్యాల్లోనే కేంద్ర పథకాల అమలును పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు సూచించడం, అమలులో సమయపాలనను నిర్ధారించడం ఉన్నాయి.

—ఎంపీ ఫండ్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి…

తన ఎంపీ నిధులను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 90 శాతం కేటాయించినప్పటికీ ఆన్లైన్లో మాత్రం వాటి నమోదు సంఖ్యను తక్కువ చూపడం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ఫండ్స్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పూర్తయిన పనులకు సంబంధించిన చెల్లింపులు కూడా వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

—రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన…

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలన్నారు.

—గర్భిణీల వివరాలు 100 శాతం నమోదు చేయాలి…

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా గర్భిణీల వివరాలు 100 శాతం ఎందుకు నమోదు కావడం లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యను ఎంపీ డా.కడియం కావ్య ప్రశ్నించారు. గర్భిణీల వివరాలను తప్పనిసరిగా వంద శాతం నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులో ఉందా లేదా పరిశీలించాలని సూచించారు. పేద ప్రజలకు ఇన్సులిన్ కొనుగోలు చేయడం భారంగా మారుతున్నందున ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మేరకు మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు.ఓపీ విధానంలో అందుతున్న క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వంద శాతం అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

–-బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలపై చర్యలు..

ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలల పరిరక్షణకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయం చేసుకుని బాల్యవివాహాల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు.

—ప్రమాద ప్రాంతాలను గుర్తించి చర్యలు…

జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను రహదారుల శాఖ, జాతీయ రహదారుల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

–వరంగల్ మ్యూజియం అభివృద్ధిపై ప్రతిపాదనలు—

వరంగల్ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని పురావస్తు శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. మ్యూజియం అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.అధికారుల పనితీరుతోనే ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు చేరుతాయని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే క్షేత్రస్థాయిలో అభివృద్ధి, మార్పు కనిపిస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.

—టీబీ బాధితులకు పోషకాహార కిట్ల పంపిణీ…

అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య టీబీ బాధితులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. టీబీ బాధితులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని ఎంపీ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజు గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.