వరంగల్, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ రైతులు భూగర్భ జలాలు, నీటి వనరులను సంరక్షించుకుంటూ బిందు సేద్యం ద్వారా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. తక్కువ నీటితో అధిక లాభాలు పొందే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని, జిల్లాలో ఎగుమతులకు అవకాశమున్న పంటలను ప్రోత్సహించాలని అన్నారు.గీసుకొండ మండలం కొనేమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం వరంగల్ జిల్లా ఆయిల్‌పామ్ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ… నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధిక నీటి వినియోగం అవసరమయ్యే పంటల వైపు వెళ్లకుండా, నీటి పొదుపు పద్ధతులను అవలంబించాలని తెలిపారు.ఆయిల్‌పామ్ సాగులో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై జాతీయ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ, పెదవేగి, ఏలూరు జిల్లా నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి. ప్రసాద్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ముఖ్యంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, పరాగసంపర్క కీటకాల వినియోగం, గెలల అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.శాస్త్రవేత్త రాజు పోషకాల యాజమాన్యంపై రైతులకు సూచనలు అందించారు.జిల్లా ఉద్యాన అధికారి ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ..జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచడంతో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి ఉద్యానశాఖ అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఆయిల్‌పామ్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉద్యాన అధికారులు రాకేష్, జ్యోతి, మానస తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 400 మంది రైతులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు.




