వరంగల్, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08….టిబి ముక్త్ భారత్ సాధనలో యువత, ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.టిబినిర్మూలనలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత కేసులను గుర్తించి సకాలంలో పరీక్షలు, చికిత్స అందేలా చూడాలని సూచించారు.వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘టిబి ముక్త్ భారత్ – ఆయుష్మాన్ కోసం జోష్ టీముల’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…క్షయ వ్యాధి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి అని, ప్రధానంగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని కలెక్టర్ తెలిపారు.చికిత్స పొందని టిబి రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మక్రిముల ద్వారా ఇతరులకు వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. రెండు వారాలకు మించి తగ్గని దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, నీరసం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.ఇలాంటి లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి కఫ పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి వైద్యుల సూచన మేరకు ఛాతీ ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించుకోవాలని తెలిపారు.టిబి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే చికిత్సను వైద్యుల సూచనల మేరకు పూర్తిగా తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని పేర్కొన్నారు.
–డ్రగ్ రెసిస్టెంట్ టిబిపై అప్రమత్తత అవసరం..
డ్రగ్ రెసిస్టెంట్ టిబి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మందులను సక్రమంగా, నిర్దేశించిన కాలం పాటు తీసుకోకపోతే ఔషధ నిరోధకత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. డ్రగ్ రెసిస్టెంట్ టిబి ఉన్నవారు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ చికిత్సను పూర్తి చేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో టిబిపై అవగాహన కల్పించడంలో జోష్ టీములు, ఎన్సీసీ క్యాడెట్లు, యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రామాల్లో టిబి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించి అనుమానిత కేసులను గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందేలా చూడాలని సూచించారు.ప్రతి గ్రామాన్ని టిబి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, యువత, ప్రభావశీల వ్యక్తుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యశాఖతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసి వరంగల్ జిల్లాను టిబి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు.
–టిబి రహిత గ్రామాల సర్పంచులకు సన్మానం…
టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో టిబి రహిత గ్రామాలుగా గుర్తించబడిన గ్రామాల సర్పంచులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి సన్మానించారు. శాలువాలతో సత్కరించి టిబి ముక్త్ భారత్ గ్రామాల సర్టిఫికెట్లను అందజేశారు.చాపలబండ గ్రామ సర్పంచ్ ఆలేటి పశు, దేశాయిపల్లి సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి, చెన్నారం సర్పంచ్ సింధం లలిత, కాశిగూడెం సర్పంచ్ పటాన్ రాజాక్, లోహిత గ్రామ సర్పంచ్ బొమ్మ నాగేష్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్క అనిత తరపున ఎంపీడీవో వెంకట రమణ సర్టిఫికెట్ అందుకున్నారు.అనంతరం టిబి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యా రాణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఐ. ప్రకాష్, డాక్టర్ ఆర్. రాజమౌళి, డాక్టర్ సాజిదా అతహరి, డాక్టర్ అరుణ్ జోషి, డిప్యూటీ డెమో ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, టిబి రహిత గ్రామాల సర్పంచులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్సీసీ కమాండర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు, విద్యార్థులు, టిబి విభాగ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




