పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి, మహమ్మద్ అయూబ్ తో కలిసి హన్మకొండ డీసీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారంలో ఉన్నది ఎవరు? నిర్మాణ నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? నేడు బ్యారేజీల పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
–కాళేశ్వరం పేరుతో రాజకీయాలు చేయడం ఆపాలి”..
కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఘనతగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు తమ పదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టం, నిర్మాణ నాణ్యతపై వచ్చిన ప్రశ్నలు, ప్రాజెక్టు నిర్వహణ అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
–ప్రజాధనం.. రైతుల భవిష్యత్తు ముఖ్యం…
ప్రజల పన్నుల రూపంలో సమకూరిన వేల కోట్ల రూపాయలతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకు అతీతంగా బాధ్యతను నిర్ణయించాలని అన్నారు. రైతులకు సాగునీరు అందించడం, తాగునీటి అవసరాలను తీర్చడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులను ఆందోళనకు గురిచేసేలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు సూచించారు. వాతావరణ పరిస్థితులపై రైతులు అపోహలకు గురికావద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలతో పరిశీలించాలని కోరారు.
–అసత్య ప్రచారాలతో రైతులను ఆందోళనకు గురిచేయవద్దు..
ఎల్‌నినో ప్రభావం పేరుతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాల వల్ల రైతులు అనవసర ఆందోళనకు గురికావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులపై శాస్త్రీయ సమాచారం, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ పంటల సాగు విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాలని కోరారు.




