పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 27
ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు.ఇందులోభాగంగా గీసుకొండ మండలం వంచన గిరి, దుగ్గొండి మండలంలోని ఎంఐ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతిని పరిశీలించి, కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్నినో ప్రభావాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని,అందులో మొక్క జొన్న, కందులు, పెసలు,మినుములు మరియు నూనె గింజల పంటలను సాగు చేయాలని అన్నారు.ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడంతో పాటు కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు.పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.ఈ పర్యటనలో జడ్పి సీఈఓ వసంత, డీఆర్డీఓ నాగ పద్మజ , ఏపీఓ, ఈసీ, సాంకేతిక సహాయకులు (టీఏలు), గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.




