వరంగల్ పరివర్తన అవాజ్ దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 29:
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో జవాన్లు కీలక భూమిక పోషించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.మంగళవారం లాల్‌బహదూర్ కళాశాలలోని ఆడిటోరియంలో పారిశుద్ధ్య జవాన్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి జవాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడి, వారి పరిధిలోని పారిశుద్ధ్య పరిస్థితులు, సిబ్బంది విధులు, చెత్త సేకరణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ….
ప్రతి జవాన్ తనకు కేటాయించిన వార్డు పరిధిపై పూర్తి పట్టు కలిగి ఉండాలని, పారిశుద్ధ్య నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు.ప్రతి జవాన్ ప్రతిరోజూ బయోమెట్రిక్ ద్వారా పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు ఉదయం 5 గంటలకే చేయాలని, తమ పరిధిలోని సిబ్బంది, వారికి కేటాయించిన ప్రాంతాలు, నిర్వహించాల్సిన పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.తడి, పొడి చెత్త వేర్పాటు, ఇంటింటి చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరు తదితర అంశాలపై జవాన్లు పూర్తి అవగాహనతో పనిచేయాలని, చెత్త సేకరణలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన ప్రాంతాల్లో గ్యాంగ్‌మెన్‌లను వినియోగించుకుని పారిశుద్ధ్య పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. సెంట్రల్ మీడియన్లలో చెత్తాచెదారం లేకుండా చూసి, అక్కడి మొక్కలు సక్రమంగా పెరిగేలా పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. రాబోయే నెల రోజుల పాటు ప్రతి జవాన్ తన పరిధిపై ప్రత్యేక దృష్టి సారించి పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకురావాలని, నెల రోజుల అనంతరం తిరిగి సమావేశం నిర్వహించి పనితీరును సమీక్షిస్తామని కమిషనర్ వెంకన్న తెలిపారు.నగర పారిశుద్ధ్య నిర్వహణలో జవాన్లు కీలక పాత్ర పోషిస్తూ, తమ వార్డు పరిధిపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన అన్నారు.ప్రతి వార్డులో జవాన్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రోడ్లపై, చెత్త పాయింట్ల వద్ద చెత్త లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కమిషనర్ టీ. వెంకన్న ఆదేశించారు. మెరుగైన పనితీరు కనబరిచే జవాన్లకు ప్రశంసా పత్రాలతో మెరిటోరియస్ సర్వీస్‌గా గుర్తింపు ఇస్తామని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, సానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను నరేందర్, అనిల్, భాస్కర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు




