( పరివర్తన అవాజ్ ) నిజామాబాద్ జిల్లా అక్టోబర్ 23: కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై కచ్చితమైన గణాంకాలు సేకరించినప్పుడే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల్లో న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.అక్టోబర్ 23 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఎల్ఎఫ్ నాయకులు ఎస్. సిద్ది రాములు, సబ్బని లత, మేత్రి రాజశేఖర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోయడ నర్సింహులు, జిల్లా కన్వీనర్లు కె. మధు, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




