పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 22
మానవతా విలువలకు, స్వచ్ఛంద సేవలకు ప్రతీకగా నిలుస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అవసరంలో ఉన్న పేదలు, నిరుపేదలు, బాధితులకు రెడ్‌క్రాస్ సభ్యులు సమన్వయంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకొని సమాజ సేవలో భాగస్వామి కావాలని కోరారు. మహిళా, శిశు సంక్షేమం, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ శాఖలు, సంస్థ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
—వయోవృద్ధుల కోసం ‘ప్రణామ్’ కార్యక్రమం….
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సూచించారు. ‘ప్రణామ్’ కార్యక్రమం ద్వారా వయోవృద్ధులకు ఆహ్లాదకరమైన కార్యక్రమాలు నిర్వహించి, వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతోపాటు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ‘నషా ముక్త్ భారత్ – మాదకద్రవ్య రహిత వరంగల్’ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతకు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
–-రెడ్‌క్రాస్ కార్యాలయం, జనరిక్ మెడికల్ స్టోర్ల ఏర్పాటుకు వినతి…
వరంగల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలని మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కోరారు. అదేవిధంగా ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితోపాటు నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో జనరిక్ మెడికల్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసి, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
—జిల్లా సలహాదారుగా ఇ.వి. శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎంపిక….
మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం మేరకు ఇ.వి. శ్రీనివాసరావును ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా సలహాదారుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ సమావేశంలో జిల్లా తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ బేతి అశోక్‌బాబు, రాష్ట్ర పాలక మండలి సభ్యులు, జిల్లా గౌరవ సలహాదారు ఇ.వి. శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్‌కుమార్, రాష్ట్ర పాలక మండలి సభ్యులు నాడెం శాంతికుమార్, కోశాధికారి బొల్లం శివ, జిల్లా పాలక మండలి సభ్యులు మండల పరశురాములు, తోట సంపత్‌కుమార్, చొప్పరి సోమయ్య, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్‌బాబు, మోతె తిరుపతిరెడ్డి, డాక్టర్ గజవెల్లి రాజ్‌కుమార్, ముల్క ప్రసాద్, వడ్డె రాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్, సుమన్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత, సహాయ కార్మిక శాఖ అధికారి భార్గవ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
మానవతా సేవలను మరింత విస్తరిస్తూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ, రక్తదానం, వయోవృద్ధుల సంక్షేమం, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించే దిశగా రెడ్‌క్రాస్ సొసైటీ కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.




