Thursday, October 22, 2026
Home People ●●●●ఖిలా వరంగల్‌లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు●●● ●●● కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి...

●●●●ఖిలా వరంగల్‌లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు●●● ●●● కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాలి పర్యాటక అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

0
107

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక   వరంగల్, సెప్టెంబర్ 27:

ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ… కాకతీయుల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలం నాటి చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చారిత్రక కట్టడాలను సంరక్షించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.ఖిలా వరంగల్‌లో గుర్తించిన పురాతన శివాలయానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు పూజారి నియామకం వంటి చర్యలు చేపడితే మరింత ఆకర్షణీయంగా మారుతుందన్నారు. చారిత్రక ప్రదేశాల్లో కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే విగ్రహాలు, కళారూపాలను ఏర్పాటు చేయాలని సూచించారు.వరంగల్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే హోటళ్లు, రవాణా, పార్కింగ్ తదితర మౌలిక వసతులను మెరుగుపరచాలని అన్నారు. రామప్ప, లక్నవరం వంటి ప్రాంతాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు రావడంలో జిల్లా యంత్రాంగం కృషి కీలకమని పేర్కొన్నారు.

–పర్యాటక రంగంలో అపార అవకాశాలు: గుండు సుధారాణి….

కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ కాకతీయుల చారిత్రక వారసత్వానికి ప్రతీకగా ఉన్న ఖిలా వరంగల్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఖిలా వరంగల్ చుట్టూ ఉన్న ఇన్నర్ మోట్, ఔటర్ మోట్‌లను అభివృద్ధి చేసి బోటింగ్ తదితర పర్యాటక కార్యకలాపాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.వెయ్యి స్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్ వంటి చారిత్రక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తే దేశ, విదేశాల నుంచి మరింత మంది పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.

–ఏఐతో కాకతీయుల వైభవాన్ని పరిచయం చేయాలి: కలెక్టర్ సత్యశారద…

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.కాకతీయుల కాలం నాటి చరిత్ర, నిర్మాణాలు, జీవన విధానాన్ని ఆధునిక సాంకేతికత ద్వారా పర్యాటకులకు పరిచయం చేయవచ్చన్నారు.వరంగల్ జిల్లాలో మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక, పర్యావరణ పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెంబర్తి కళ, రంగసాయిపేట మెటల్ క్లస్టర్, వరంగల్ దర్రీలకు ఉన్న జీఐ గుర్తింపును సాంస్కృతిక పర్యాటకంలో భాగంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.పర్యావరణ పర్యాటకానికి పాకాల వన్యప్రాణి అభయారణ్యం కీలక ప్రాంతమని తెలిపారు. పర్యాటకులను మూడు నుంచి ఐదు రోజుల పాటు వరంగల్‌లో నిలిపేలా పర్యాటక సర్క్యూట్లు, ఇన్నర్ మోట్, ఔటర్ మోట్ అభివృద్ధి, ఇతర మౌలిక వసతులపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.భావితరాలకు కాకతీయుల గొప్పతనాన్ని పరిచయం చేయడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్న కలెక్టర్, జిల్లాలోని పాఠశాలల్లో యువ టూరిజం క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, టూరిజం వాక్స్ నిర్వహించనైనది.సాంస్కృతిక కార్యక్రమాల పాల్గొన్నా విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలను ప్రముఖుల చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్ , అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,వరంగల్ ఆర్డీవో సుమ,నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డివైఎస్ఓ మరియు ఇంచార్జ్ పర్యాటక శాఖ అధికారి రమేష్, ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్,సంబధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పర్యాటక శాఖ అధికారులు, విద్యార్థులు, కళాకారులు, పర్యాటకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.