ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
(పరివర్తన అవాజ్ ) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17: కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. శనివారం స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దసరా ఉత్సవ కమిటీని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కోసం 25 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా ఉత్సవాలను కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపించి ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దసరా వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, క్రీడలు, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్సవాలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కామారెడ్డి పట్టణంలో దసరా వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని మహమ్మద్ అలీ షబ్బీర్ కోరారు. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.




