జిడబ్ల్యూఎంసీ, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు, 18, 20 తేదీల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్సవాల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ గ్రేటర్ వరంగల్ లోని పద్మాక్షి గుట్ట, బొందివాగు, బంధం చెరువు, భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడి, గుండుచెరువు, పెద్ద చెరువు, హసన్‌పర్తి, ఉర్సుగుట్ట, బెస్తం చెరువు, రంగశాయిపేట, మెట్టుదర్వాజా, శివనగర్, కట్టమల్లన్న, తోట మైదానం, చిన్న వడ్డేపల్లి, కాశిబుగ్గ తదితర ప్రాంతాలను కమిషనర్ సందర్శించి సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. బతుకమ్మ వేడుకలు, దసరా ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఉత్సవ ప్రదేశాలు, ఆలయాల పరిసరాలు, ప్రధాన రహదారులు, చెరువుల వద్ద నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన చోట్ల ఫాగింగ్, క్రిమిసంహారక మందుల పిచికారీ చేపట్టాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, అవసరమైన చోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు.ఉత్సవ ప్రాంతాల్లో వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట్ల హైమాస్ట్ లైట్లు, అదనపు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.బతుకమ్మ నిమజ్జనం అనంతరం పూలు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి చెరువుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ టీ. వెంకన్న సూచించారు.ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, సంబంధిత ఈఈలు, డీఈలు, ఎంటమాలజీ అధికారి రజని సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




