పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 స్టేషన్ ఘనపూర్
ఎల్ నీనో ప్రభావంతో దేశంలో, రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్న వేళ.. వర్షపు నీటిలోని ప్రతి ఒక్క చుక్కనూ ఒడిసిపట్టి రైతులకు సాగునీరుగా అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామం వద్ద వాగులో వరద నీరు వృథాగా పోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే స్పందించి నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేశారు. వాగు పక్కనే ఉన్న కెనాల్ ద్వారా ఈ వరద నీటిని లింగాల ఘనపూర్ మండలంలోని నవాబ్‌పేట రిజర్వాయర్‌లోకి మళ్లించాలని నిన్న సాయంత్రం ఆదేశించారు. ఎమ్మెల్యే సూచనలతో రాత్రికి రాత్రే పనులు ప్రారంభం కాగా శనివారం ఉదయమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా శ్రీమన్నారాయణపురం వద్దకు వెళ్ళి మళ్లింపు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులో పారుతున్న వరద నీరు వృథా కాకుండా కెనాల్ ద్వారా నవాబ్‌పేట రిజర్వాయర్‌కు మల్లించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందని, పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల్లో లభించిన ఈ కొద్దిపాటి వరద నీరు రైతులకు సంజీవని లాంటిదని అభివర్ణించారు.గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఇదే శ్రీమన్నారాయణపురం ప్రాంతంలో కాలువలన్నీ ఇసుక మేటలు వేసి, పూడిక పేరుకుపోయి దిక్కులేని స్థితిలో ఉండేవని నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇసుక మేటలను తొలగించి, కెనాల్స్‌కు సమగ్ర మరమ్మత్తులు చేయించానని దాని ఫలితంగానే నేడు నవాబ్‌పేట రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను తీసుకెళ్లగలిగాం”అని వివరించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా రఘునాథపల్లి మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరు అందుతోందని వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి గోదావరి జలాలను రప్పించి పంటలను కాపాడుతున్నామని తెలిపారు. రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని వృథా చేయకుండా ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరందించేందుకు తాను నిరంతరం శ్రమిస్తున్నానని, అయితే ప్రస్తుత నీటి లభ్యత మరియు వర్షాభావ పరిస్థితులను దృష్ట్యా రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలనే సాగు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




