Thursday, October 22, 2026
Home People –వానాకాలం పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి* –యాసంగి సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణంగా...

–వానాకాలం పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి* –యాసంగి సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణంగా రూపొందించాలి…. –రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు…

0
15

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9  రాష్ట్రంలో వానాకాలం 2026 పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.శుక్రవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వానాకాలం పంట, వర్షపాతం వివరాలు, వ్యవసాయ కార్యకలాపాలు, రానున్న యాసంగి 2026–27 సాగు ప్రణాళిక, త్రాగునీటి సరఫరా, జల సంరక్షణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో 2026 సెప్టెంబర్ 30 నాటికి సాధారణ వర్షపాతంతో పోలిస్తే 17 శాతం లోటు వర్షపాతం నమోదైందని, అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు వర్షపాత లోటు 99 శాతంగా ఉందని తెలిపారు.వానాకాలం 2026లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి మొత్తం 1 కోటి 31 లక్షల 38 వేల 611 ఎకరాలలో సాగు నమోదు అయిందని, ఇందులో 57 లక్షల 4 వేల 059 ఎకరాలలో వరి, 48 లక్షల 43 వేల 606 ఎకరాలలో పత్తి, 5 లక్షల 92 వేల 472 ఎకరాలలో మొక్కజొన్న, 7 లక్షల 97 వేల 772 ఎకరాలలో పప్పుధాన్యాలు సాగు జరిగిందని తెలిపారు.కొన్ని జిల్లాలలో వర్షపాత లోటు కారణంగా పంటలు వాడిపోవడం, ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులను నిరంతరం పరిశీలించాలని సూచించారు.ముఖ్యంగా పత్తి, వరి తదితర పంటలపై వర్షాభావ ప్రభావాన్ని అంచనా వేసి, రైతులకు అవసరమైన వ్యవసాయ సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రానున్న యాసంగి 2026–27 సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 65 లక్షల 89 వేల 293 ఎకరాలలో అంచనా సాగు జరుగుతుందని, గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి 29.3 శాతం తక్కువ సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడం జరిగిందని తెలిపారు.నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, సాగునీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు.నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో వరి సాగును నిరుత్సాహపరుస్తూ, ఆయా ప్రాంతాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతు ఐడీల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వానాకాలం 2026 ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని తెలిపారు.వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి సిబ్బంది, రైతు వేదికల ద్వారా రైతులకు సకాలంలో వ్యవసాయ సలహాలు అందించాలని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు నిరంతర త్రాగునీరు సరఫరా అందించేలా మిషన్ భగీరథ, సాగునీటి శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రాష్ట్రంలో త్రాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 14, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 20 కలిపి మొత్తం 34 జలాశయాలను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ జలాశయాలలో త్రాగునీటి అవసరాలకు సరిపడా ఏడాది కాలానికి అవసరమైన ముడి నీటిని నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టాలని, వాటిపై ఆధారపడిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు ఎగువ జలాశయాల్లోనూ తగిన నీటి నిల్వలు ఉండేలా చూడాలని సూచించారు. గ్రామాల్లోని చేతిపంపులు, నీటి సరఫరా పథకాలు, బహిరంగ బావులు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, స్థానిక నీటి వనరులను పరిరక్షిస్తూ నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యుత్, సాగునీరు, ప్రజారోగ్య ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో త్రాగునీటి సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.అవసరమైన ప్రాంతాలలో జలాశయాల డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వినియోగించుకునేందుకు తాత్కాలిక పంపుల ఏర్పాట్లపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది క్రియాశీల కూలీలు ఉన్న నేపథ్యంలో విబి జి రామ్ జి పథకం క్రింద కూలీల సమీకరణను సమర్థవంతంగా చేపట్టి, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ, అవసరమైన కూలీలను పనులలో భాగస్వాములను చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.తెలంగాణ జలసిరి కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మ్యాజిక్ సోక్‌పిట్ల నిర్మాణం, 50 వేల ఫామ్ పాండ్ల ఏర్పాటు, 12 వేల పెర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, 12 వేల బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఈ నిర్మాణాలు దోహదపడేలా పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద కమ్యూనిటీ సోక్‌పిట్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. పని చేస్తున్న బోరు బావుల వద్ద సోక్‌పిట్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఎండిపోయిన బోరు బావుల వద్ద భూగర్భ జలాల పునరుద్ధరణకు అనువైన రీచార్జ్ నిర్మాణాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.గ్రామాలలో నీటి సంరక్షణకు అవసరమైన నిర్మాణాలను గుర్తించి, వాటి ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సాగునీటి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.రైతులకు సకాలంలో వ్యవసాయ సలహాలు అందించడం, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయడం, ప్రజలకు నిరంతరం త్రాగునీరు సరఫరా చేయడం, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడం, జల సంరక్షణ నిర్మాణాల లక్ష్యాలను సాధించడం వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదేశాల మేరకు సంబంధిత శాఖలఅధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా యొక్క , కాలానుగుణ పరిస్థితుల అనుగుణంగా ప్రజలకు మరియు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, డిఆర్ఓ విజయ లక్ష్మి,జడ్పి సీఈఓ వసంత,జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.