పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ::: సెప్టెంబర్ 19
16వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను నిబంధనల ప్రకారం చేపట్టి, సంబంధిత పనుల ప్రతిపాదనలు, వివరాలను సమగ్రంగా పరిశీలించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో **16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) నిధులతో చేపట్టే పనులు, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP)**పై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల్లో 16వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతిపాదించిన పనుల వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పనుల ప్రతిపాదనలు, అవసరాలు, సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సమాచారంతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగవంతం చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల నిల్వలను పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లలో నాన్-స్టార్టెడ్‌గా ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో సమన్వయం చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించేలా అవగాహన కల్పించాలని, ఇప్పటికే ప్రారంభమైన ఇళ్ల నిర్మాణాలను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుక సరఫరా కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, జడ్పీ సీఈఓ వసంత, ఆర్‌డబ్ల్యూడీ ఈఈ నిర్మల, హౌసింగ్ ఇన్‌చార్జి పీడీ విష్ణు వర్ధన్ రెడ్డి డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. రాజిరెడ్డి, అదనపు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



