అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు గారు అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే ఉద్దేశంతో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్ల మేర పరిపాలనా అనుమతులు మంజూరు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎదురుచూపులు నెలకొన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు గారు ప్రభుత్వాన్ని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కీలకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగవంతం చేసి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు గారు కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉచిత బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టడం అభినందనీయం,ముఖ్యంగా గర్ల్స్ హాస్టళ్లలో భవన నిర్మాణాలు కాంపౌండ్ వాల్స్ ఇతర మౌలిక వసతులతో పాటు రాత్రి వేళలు కూడా సెక్యూరిటీ సిబ్బందిలను ఏర్పాటు చేయాలని సభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

