పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19 జిడబ్ల్యుఎంసి: సెప్టెంబర్ 19.
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారంగా సమగ్ర ప్రాపర్టీ సర్వే నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని బల్దియా కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.శనివారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో జీఐఎస్ టెక్నికల్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఐఎస్ ఆధారిత ఆస్తి పన్ను సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, సాంకేతిక అంశాలు, అవసరమైన డేటా సేకరణ, భవిష్యత్ వినియోగంపై చర్చించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. సర్వేలో నగరంలోని ఆస్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని శాస్త్రీయంగా నమోదు చేసేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఎన్‌ఐటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్‌లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కమిటీ సభ్యుల సూచనలు, సాంకేతిక అవసరాలు, నగర భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని **ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)**ను సమగ్రంగా రూపొందించాలని కమిషనర్ పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఐటీ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.



