పరివర్తన అవాజ్,కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొత్తగూడెం 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఖండించారు..
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా తప్పు అని ఆమె ఖండించారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడం అని పేర్కొన్నారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఏర్పాటుచేసిందని తెలిపారు. అలాంటి నిర్ణయాన్ని తక్కువ చేసి మాట్లాడటం బీజేపీ నాయకుల అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు.
తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన తేజస్వీ సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, యావత్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సుప్రియ డిమాండ్ చేశారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే ఏ శక్తినైనా కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ బిడ్డగా ఎండగడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
