
పాల్గొన్న సామాజిక కార్యకర్తలు గులాం మతీన్, లెంటిల్, కీర్తన్, జాయ్
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు యువత ముందుకొచ్చింది. “అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దు – అభివృద్ధిని ఎంపిక చేసుకోండి” అనే నినాదంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ఓటర్ల అవగాహన కోసం రూపొందించిన ప్రత్యేక వాల్ పోస్టర్ ను సామాజిక కార్యకర్తలు గులాం మతీన్, లెంటిల్, కీర్తన్, జాయ్ విడుదల చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటును అమ్ముకోవడం వల్ల భవిష్యత్తులో ప్రజలే నష్టపోతారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లోనుచేసి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని, అలాంటి చర్యలకు లొంగకుండా నిజాయితీగా పనిచేసే, అభివృద్ధి పట్ల కట్టుబాటుగా ఉండే అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటేనే పట్టణాభివృద్ధి వేగవంతం అవుతుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ప్రజల్లో ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ వంటివని, ప్రతి ఓటు సమాజ అభివృద్ధికి దోహదపడే శక్తిగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.అదేవిధంగా ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రజలు ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఓటర్లలో చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుని మంచి పాలనను తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువత, ప్రజలు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
