
8 వార్డు మెంబర్ భుక్య అనూష ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యకు పరిష్కారం
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-గ్రామాభివృద్ధి అంటే కేవలం కార్యాలయాల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం కాదని, ప్రజల మధ్యే ఉండి సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడమే అసలైన పాలన అని నంద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ బలరాం నిరూపిస్తున్నారు.అంబేద్కర్ నగర్ కాలనీ 8వ వార్డు అభ్యర్థి అనూష కాలనీలో ఉన్న సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురాగానే, ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకుని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు సిబ్బందితో కలిసి అక్కడే ఉండి పనులు పూర్తి చేయించడం సర్పంచ్ ప్రత్యేకతగా నిలిచింది.
తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య పనులు, పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన అంశాలు వంటి వాటిలో సర్పంచ్ మాలోత్ బలరాం ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు సమస్య ఉందని చెప్పగానే “చూద్దాం” అనే మాటకు బదులుగా “ఇప్పుడే పరిష్కారం” అనే విధానంతో ముందుకు సాగుతున్నారు.
ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారకముందే పరిష్కారమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులకు మాత్రమే పనులు అప్పగించి వదిలేయకుండా, స్వయంగా పర్యవేక్షణ చేయడం వల్ల పనుల నాణ్యత మెరుగుపడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాభివృద్ధి పనుల్లో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం, సిబ్బందిపై నియంత్రణ వంటి అంశాలకు సర్పంచ్ మాలోత్ బలరాం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. పంచాయతీ సిబ్బందిని సమన్వయంతో నడిపిస్తూ, ప్రతి పనిని గడువులో పూర్తి చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
తండా ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామం పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తున్న సర్పంచ్ సేవాభావానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, నంద తండా గ్రామపంచాయతీ ఇందుకు నిదర్శనమని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తూ గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సర్పంచ్ మాలోత్ బలరాం నేటి తరం ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
