

పరివర్తన అవాజ్,కొత్తగూడెం
ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా, సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో నిర్వహించిన సైకిల్ ర్యాలీని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులను ఎన్నుకునే అత్యున్నత హక్కు ఓటు హక్కు అని అన్నారు. ప్రజల అభిప్రాయాలకు ఆమోదయోగ్యంగా, ఎక్కువమంది ఆదరణ పొందిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని తెలిపారు. గతంలో ఓటు హక్కు సాధన కోసం అనేక త్యాగాలు, ఉద్యమాలు, పోరాటాలు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జాతీయ ఓటరు దినోత్సవం ప్రతి పౌరుడు ఓటు హక్కు విలువ, విశిష్టతను అవగాహన చేసుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో తన పాత్రను గుర్తించేందుకు ఒక మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా నూతన ఓటర్లు, యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నూతన ఓటర్లు, యువత, ప్రజలు, అధికారులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ ప్రతిజ్ఞలో భాగంగా “భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతామని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణను పరిరక్షిస్తామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా మా ఓటు హక్కును వినియోగిస్తామని” ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఓటు హక్కు వినియోగం, పై నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్య విలువలు, ఓటు ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు కొనసాగగా, ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగంపై అవగాహన సందేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి పరంధామ రెడ్డి, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ , పాల్వంచ తాసిల్దార్ ధారా ప్రసాద్, ఎన్నికల ట్రైనర్ సాయి కృష్ణ,ఎన్నికల సిబ్బంది నవీన్,సంబంధిత శాఖల అధికారులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
