
పరివర్తన ఆవాస్,కొత్తగూడెం:-పట్టణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొత్తగూడెం డీఎస్పీ ఎల్. ఆదినారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు మరియు వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వరావు, వన్ టౌన్ సీఐ కరుణాకర్, 3 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి ఎస్హెచ్ఓ రవి కుమార్, ఎస్సై ఉమా, కానిస్టేబుల్స్ రవి, పూజారి రమేష్ బాబు పాల్గొన్నారు. అలాగే ఎంఎస్ పాన్ మహల్ ప్రొప్రైటర్ గులాం మతీన్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేర నియంత్రణలో కీలక మార్పులు వస్తాయని తెలిపారు. ప్రమాదాలు లేదా ఇతర నేర సంఘటనలు జరిగిన వెంటనే నేరస్తులను గుర్తించి పట్టుకోవడం సులభమవుతుందని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు మరియు ఇతర నేరాలు తగ్గే అవకాశముందని వివరించారు.
పట్టణ భద్రత కోసం ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ, భద్రతా చర్యలు మరింత పెరగాలని కోరుకున్నారు.
