
పరివర్తన అవాజ్ కొత్తగూడెం, ఫిబ్రవరి 26: రాష్ట్రవ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉదయం నుంచే హాజరై పరీక్షలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ సందర్శించారు. పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి, కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అనవసరంగా గుమికూడవద్దని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి సహకరించాలని ఎస్ఐ రాకేష్ కోరారు. తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడకుండా దూరం పాటించాలని సూచించారు.
పరీక్షలు సజావుగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కొనసాగుతున్నాయని కేంద్ర నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు.
