మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాఠశాల ఆవరణలో, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ బండిల్‌పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఎన్నికల సామగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, సిబ్బందికి తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక సదుపాయాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎలాంటి లోటుపాట్లు లేదా గందరగోళానికి తావులు లేకుండా, చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సామగ్రి అందిందా లేదా జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ హెచ్చరించారు. సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులకు అప్పగించారు. అలాగే, పోలింగ్ సామగ్రి, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లను తరలించే సమయంలో సాయుధ పోలీసు బందోబస్తు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తిన సందర్భంలో వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో సంబంధిత ఎన్నికల అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
