
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే జాతీయ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పంచాయతీ పరిధిలోని గరీపేట గ్రామంలో జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ జాతర వేడుకలు భక్తుల సందడితో ఉత్సాహంగా జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు కామిశెట్టి కొండలరావు, శాంతాదేవి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నారు. 28వ తేదీన సారలమ్మ వనం విడిచి గ్రామంలోకి రానుండగా, 29వ తేదీన సమ్మక్కను గ్రామానికి తీసుకురానున్నారు. 30వ తేదీన విశిష్ట పూజలు నిర్వహించి, 31వ తేదీన తిరిగి వనవాసానికి అమ్మవార్లను చేర్చనున్నారు.
జాతరలో భాగంగా చిలకల గుట్ట వద్ద సంప్రదాయ బూరుగుల పూజలు, పెద్దమ్మ తల్లి సమ్మక్క–సారలమ్మ సామెత శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు కొత్తగూడెం నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, దర్శన ఏర్పాట్లు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మూడు ధంజ బానోతు, ఛాంద్య సాయిరాజ్, మంగీలాల్, ఆలయ పూజారి లింగాచారి తదితరులు పాల్గొన్నారు.
