Thursday, October 22, 2026
Home People –వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా వర్తమానాన్ని ఆనందంగా గడపాలి.. –వయోవృద్ధుల అనుభవాలను భావితరాలకు అందించాలి :...

–వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా వర్తమానాన్ని ఆనందంగా గడపాలి.. –వయోవృద్ధుల అనుభవాలను భావితరాలకు అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

0
27

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా  అక్టోబర్ 1: పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక 

వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ప్రశాంతంగా వర్తమానాన్ని ఆనందంగా గడపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.కుటుంబంలో, సమాజంలో ఓర్పుతో సర్దుబాటు అవుతూ తమ విలువైన అనుభవాలను భావితరాలకు అందించాలని కోరారు.అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల అనుభవాలు ఎంతో కీలకమన్నారు.జిల్లాలో నిర్వహిస్తున్న ‘స్ఫూర్తి’ కార్యక్రమంలో విశ్రాంత విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకోవడం అభినందనీయమన్నారు.వయోవృద్ధుల అనుభవాలను పిల్లలతో పంచుకోవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, భయం లేకుండా వేదికలపై మాట్లాడే సామర్థ్యం, ఆసక్తి పెరుగుతున్నాయని తెలిపారు.వయోవృద్ధులు కృంగిపోకుండా ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా ప్రస్తుతాన్ని సంతోషంగా ఆస్వాదించాలని సూచించారు.తల్లిదండ్రులు తమ ఆస్తిపాస్తులను తమ వద్దే ఉంచుకోవాలని, అవసరమైతే వీలునామా రాయాలని కలెక్టర్ సూచించారు.కొడుకులు, కూతుళ్లకు ముందుగానే సేల్‌డీడ్ లేదా గిఫ్ట్‌డీడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. వయోవృద్ధులకు ఏవైనా సమస్యలు ఎదురైతే 14567 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అవసరమైన సహాయం పొందాలని సూచించారు.అడిషనల్ కలెక్టర్లు మాట్లాడుతూ వయోవృద్ధులు తమ హక్కులు, వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆర్డీవో, జిల్లా కలెక్టర్ లేదా జిల్లా సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.ఆర్డీవో నర్సంపేట ఉమారాణి మాట్లాడుతూ వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.జిల్లా సంక్షేమ అధికారి రాజమణి మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా సంక్షేమ శాఖను సంప్రదించాలని కోరారు.జిల్లా వయోవృద్ధుల కమిటీ సభ్యులు మల్లారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల పోషణ, సంరక్షణ బాధ్యత కుటుంబ సభ్యులదేనని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయరాదని కోరారు.ఈ సందర్భంగా గతంలో రైల్వే ప్రయాణాల్లో వయోవృద్ధులకు కల్పించిన 40 శాతం రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా వయోవృద్ధుల కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రాయితీ పునరుద్ధరణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టానికి సంబంధించిన గైడ్ పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లలో వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించే డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. వయోవృద్ధులతో ప్రతిజ్ఞ చేయించారు.జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను వయోవృద్ధుల తరఫున శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, ఆర్డీవో నర్సంపేట ఉమారాణి, డీఏఓ ఫణికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి, పీడీ డీఆర్డీఏ నాగపద్మజ, జిల్లా వయోవృద్ధుల కమిటీ సభ్యులు మల్లారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.