ఒడిశా గవర్నర్తో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం భేటీ
ఒడిశా ప్రగతిశీల వృద్ధితో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి
{హైదరాబాద్ పరివర్తన ఆవాజ్ ఫిబ్రవరి 6 } పీఐబీ నేతృత్వంలో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం ఈ రోజు లోక్ భవన్లో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిసింది. ప్రతినిధి బృందాన్ని సాదరంగా స్వాగతించిన గవర్నర్… ఒడిశా అభివృద్ధి ప్రయాణం, జాతీయ పురోగతికి పెరుగుతున్న ఒడిశా సహకారం గురించిన విశేషాలను పంచుకున్నారు.
మీడియా ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని, రాష్ట్ర ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. మిగులు ఆదాయం గల రాష్ట్రంగా ఒడిశా గుర్తింపు పొందిందనీ, జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుందని ఆయన పేర్కొన్నారు. ఒడిశా అభివృద్ధి ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వ నిరంతర మద్దతునూ గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన మౌలిక సదుపాయాల కార్యక్రమాలను డాక్టర్ కంభంపాటి ప్రముఖంగా ప్రస్తావించారు. అన్ని జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనేక ముఖ్యమైన జాతీయ రహదారులు ఒడిశా మీదుగా వెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం రూ.1.30 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో హైవేలు, రైల్వేలకు సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల ప్రకటించిన సెమీకండక్టర్ ప్రాజెక్ట్, జాతీయ జలమార్గం-5 వంటి ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని గవర్నర్ పేర్కొన్నారు.
ఒడిశా సహజ వనరుల ప్రయోజనాలను గురించి గవర్నర్ ప్రస్తావిస్తూ… రాష్ట్రం పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉందని తెలిపారు. పారాదీప్, ధమ్రా, గోపాల్పూర్ వంటి కీలక ఓడరేవులను ఒడిశా కలిగి ఉందనీ, బలమైన కనెక్టివిటీ నెట్వర్క్లు వీటికి మద్దతునిస్తున్నాయని అన్నారు. ఒడిశాలో బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, మాంగనీస్, క్రోమైట్ వంటి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయనీ, ఇవి వేగవంతమైన పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తున్నాయని ఆయన వివరించారు. “మైనింగ్, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి పనులకు సమర్థంగా ఉపయోగిస్తున్నారు” అని ఆయన తెలిపారు.
వ్యవసాయ రంగంలో పురోగతిని ప్రధానంగా ప్రస్తావించిన గవర్నర్… చిరు ధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ఒడిశా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. వ్యవసాయ వృద్ధిని, రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఒడిశా రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసిస్తూ… ఒడిశా హస్తకళలు, చేనేత ఉత్పత్తులు దాని ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబిస్తాయని డాక్టర్ కంభంపాటి వ్యాఖ్యానించారు. సంబల్పురి చీరలు, మానియాబంధ, గంజాం చేనేత వస్త్రాలు, కోట్పాడ్ వస్త్రాలు, ఇత్తడి, బెల్-మెటల్ వర్క్స్, కటక్ ఫిలిగ్రీ, పిపిలి అప్లిక్ (చాందువా), రఘురాజ్పూర్ పట్టచిత్రాలకు దేశవిదేశాల్లోనూ విస్తృత గుర్తింపు, డిమాండ్ ఉందని గవర్నర్ తెలిపారు.
విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా భువనేశ్వర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ఐఐటీ, ఎయిమ్స్, నైసర్, వరల్డ్ స్కిల్ సెంటర్ వంటి సంస్థలు రాజధాని చుట్టుపక్కల ఏర్పాటయ్యాయనీ, రాష్ట్ర సమగ్ర వృద్ధికి అనుకూలమైన వ్యవస్థను అవి సృష్టిస్తున్నాయని ఆయన వివరించారు.
పీఐబీ హైదరాబాద్ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ వర్గంటి గాయత్రి నేతృత్వంలోని తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం ఒడిశా అభివృద్ధి పట్ల ప్రశంసలు వ్యక్తం చేసింది. ఒడిశా రాష్ట్ర పర్యటన అనుభవాలను పంచుకుంది.
పీఐబీ భువనేశ్వర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ మహేంద్ర ప్రసాద్ జెనా, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీ స్వాధిన్ శక్తి ప్రసాద్, లోక్ భవన్ సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.



