Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 4:12 pm Posted by : parivarthanaawaaz

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి : మహమ్మద్ నయీం

పరివర్తన అవాజ్ భద్రాద్రి బ్యూరో, నవంబర్ 15: వికలాంగులు, వితంతువుల పింఛన్ల మంజూరులో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకుడు మహమ్మద్ నయీం డిమాండ్ చేశారు. కొన్ని డివిజన్లలో అర్హత లేని వారికి పింఛన్లు మంజూరు చేస్తూ, మరోవైపు సదరం ధ్రువీకరణ పత్రాలు ఉండి అర్హత కలిగిన వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వికలాంగుల పింఛన్‌కు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలనే నిబంధన ప్రకారం అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల 19వ తేదీన ఇతర లబ్ధిదారులతో పాటు అర్హులైన వికలాంగుల బ్యాంకు ఖాతాల్లోనూ పింఛన్ నగదు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోనూ ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులందరికీ న్యాయం చేయాలని, లేనిపక్షంలో సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని మహమ్మద్ నయీం స్పష్టం చేశారు.