దేవుడు అందరివాడు దేవాలయం అందరిది తుమ్మ రామచంద్రం
తాడ్వాయి పరివర్తన అవాజ్ :కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కులాల ప్రజలు కలిసికట్టుగా దేవాలయంలోకి ప్రవేశించి శివునికి అభిషేకం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తుమ్మ రామచంద్రం మాట్లాడుతూ 1936 నవంబర్ 12న అప్పటి ట్రావెన్‌కోర్ సంస్థాన మహారాజు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ దేవాలయ ప్రవేశ ప్రకటన జారీ చేశారని తెలిపారు. దీని ద్వారా సంస్థానంలోని హిందూ దేవాలయాల్లో కులభేదాలు లేకుండా అందరికీ ప్రవేశం కల్పించాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమానత్వపు హక్కును కల్పించిందని, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించిందని, హిందూ మత సంస్థలను అన్ని వర్గాలకు తెరిచేలా చట్టాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. దేవాలయం భగవంతుని దర్శనం కోసం ఏర్పడిన పవిత్ర స్థలమని, ఆ అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు అందరూ అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు.