వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 20 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి,ప్రజా సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా “డైవర్షన్ పాలిటిక్స్”తోనే కాలం గడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిశితంగా దుయ్యబట్టారు.ప్రజాధనంతో సిద్ధిపేటలో ఆర్భాటంగా సభ పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావులను తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి గంట సేపు ప్రసంగం సాగిందన్నారు.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం ఎంపీ రవిచంద్ర తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు.తీవ్ర కరువు పరిస్థితులతో రైతన్నలు,ప్రజలు అల్లాడుతుంటే, ఉపశమనం కోసం ఒక మాటైనా చెప్పకపోవడం శోచనీయమన్నారు.సిద్ధిపేటకు నిధులు మంజూరు చేయలేదని,ప్రజలకు కొత్తగా ఎటువంటి హామీలివ్వలేదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న విధానాలతో ఆయన పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.