ప్రత్యేక అధికారి హనుమంత రావు.
కలెక్టర్ తో కలిసి కందకుర్తి పుష్కర ఘాట్ సందర్శన
పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, అక్టోబర్ 23 : గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు ఇతర అధికారులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన నిజామాబాద్ జిల్లా కందకుర్తి పుష్కర ఘాట్ ను సందర్శించారు. దేవాదాయ, నీటిపారుదల, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. పుష్కరాల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో శాఖ వారీగా చేపట్టిన పనుల వివరాలు సమీక్షించి, మార్పులు చేర్పులకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఆలయాల అభివృద్ధి, నవీకరణ, నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, ఘాట్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, పార్కింగ్, వీ.ఐ.పీ ఘాట్ నిర్మాణం తదితర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. గత పుష్కరాల సమయంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా అన్నది తెలుసుకుని, ప్రస్తుతం అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. పుష్కర ఘాట్లకు ఇరువైపులా ర్యాంప్ లు నిర్మించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా చర్యల్లో భాగంగా వాచ్ టవర్, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలోని కందకుర్తి, యంచ తదితర గోదావరి పరీవాహక పుణ్యక్షేత్రాల వద్ద పుష్కరాలు నిర్వహించే అన్ని ప్రాంతాల్లో పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న కందకుర్తి పుణ్యక్షేత్రం వద్ద పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. కందకుర్తి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నందున కొత్త పుష్కరఘాట్ నిర్మాణానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు. నీటి మట్టం తగ్గిన మీదట పుష్కర ఘాట్ పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మిగితా పనులను వెంటదివెంట చేపట్టి, మైల్ స్టోన్ ప్రకారం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని, మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయకుమారి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎండోమెంట్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.