Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 3:27 pm Posted by : parivarthanaawaaz

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌స్పెక్టర్ నరహరి

▪️ వ్యక్తిగత సమాచారం భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

▪️ డిజిటల్ అరెస్ట్, నకిలీ ప్రొఫైల్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

▪️ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి

పరివర్తన ఆవాజ్  కామారెడ్డి : సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఆదివారం నాడు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, సోషల్ మీడియా తదితర డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొబైల్ యాప్‌లను ఉపయోగించే ముందు వాటి నిబంధనలు, అనుమతులను పరిశీలించాలని, ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను తెరవడం, నమ్మకంలేని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారుల పేరుతో ఫోన్ చేసి బెదిరించడం, డిజిటల్ అరెస్ట్ పేరుతో భయాందోళనలకు గురిచేయడం, తక్షణమే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా, సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి నేరాలను చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. సైబర్ మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల మోసగాళ్ల ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, బ్యాంకింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అపరిచితులు పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు. ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ మరియు ఇతర ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు పంపే ముందు సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు.

ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, సోషల్ మీడియా మోసాలు, నకిలీ ప్రొఫైల్స్ తదితర సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఎవరికీ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, మోసానికి గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

పిల్లల ఆన్‌లైన్ భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పిల్లలు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు. సైబర్ వేధింపులు, ఆన్‌లైన్‌లో అపరిచితులతో పరిచయాలు, అనుచిత కంటెంట్ వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు.

చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ చిత్రాలు, వీడియోలను వీక్షించడం, భద్రపరచడం లేదా ఇతరులకు పంపడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

స్థానికంగా సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా అరెస్టు

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు.