హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన
కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పి
మతసామరస్యంతో పండుగలను జరుపుకుందాం.. సురక్షిత కామారెడ్డిని నిర్మించుకుందాం
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ వినూత్న ఆలోచనకు అనుగుణంగా కామారెడ్డి పోలీసులు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి “హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రజలకు అందించేలా మండపాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. భక్తితో పాటు రహదారి భద్రతపై బాధ్యతను గుర్తుచేసేలా ఈ వినూత్న కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ ట్రాఫిక్ పోలీస్ బూత్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలిపారు. హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనలో భాగం కాదని.. ప్రమాద సమయంలో మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని ఎస్పీ గారు పేర్కొన్నారు. “వినాయకుడి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి.. వచ్చే ఏడాది కూడా స్వామివారి దర్శనానికి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, జాగ్రత్తగా ప్రయాణించాలి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పండుగల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, వేగ నియంత్రణతో వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
భక్తి.. బాధ్యత.. భద్రత
భక్తి వాతావరణాన్ని ప్రజల ప్రాణ భద్రతతో అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసుల ఆదేశంగా కాకుండా.. విఘ్నేశ్వరుడి సందేశంగా ప్రజలు స్వీకరించేలా రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. కేవలం ట్రాఫిక్ పోలీస్ బూత్ వద్ద మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా సందేశాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.పండుగకు భక్తి ఎంత ముఖ్యమో.. ప్రయాణంలో ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కామారెడ్డి పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాలు, కేసుల కోసమే కాదని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే వాటి ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి విఘ్నం తొలగి.. ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగి.. ప్రతి కుటుంబంలో చిరునవ్వులు నిలవాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ శ్రీ కే. నరసింహారెడ్డి , కామారెడ్డి డీఎస్పీ శ్రీ ఎస్. మధుసూదన్ , కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌ఓ శ్రీ బి. నరహరి , ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ శ్రీ చంద్రశేఖర్ , ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
