Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 10:49 am Posted by : parivarthanaawaaz

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

బాధ్యతగా వాహనాలు నడపాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కామారెడ్డి డీఎస్పీ సూచన

కామారెడ్డి, పరివర్తన ఆవాజ్ సెప్టెంబర్ 1:  కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి డీఎస్పీ హాజరై ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్, రామంచ తిరుపతి టీం సభ్యులు ఆటో డ్రైవర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కామారెడ్డి పట్టణ ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించాలని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. అలాగే ఆటోల్లో ఓవర్‌లోడ్ చేయకూడదని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు లేదా వాహనదారులకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కామారెడ్డి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.