పరివార్తన అవజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 23
వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి ఉరుసు గుట్ట చెరువు తదితర నిమజ్జన ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వేళ, వర్షం కురుస్తున్నప్పటికీ పారిశుద్ధ్య సిబ్బంది తమ విధుల్లో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. నిమజ్జన కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు నిమజ్జన ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, రహదారులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.భక్తుల విశ్వాసానికి, ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం.వారి అంకితభావం, కర్తవ్యనిబద్ధత, సమిష్టి కృషితో నిమజ్జన కేంద్రాల వద్ద పరిశుభ్రతను కాపాడుతూ “స్వచ్ఛ వరంగల్ – సురక్షిత నిమజ్జనం” లక్ష్యాన్ని సాకారం చేసేందుకు జీడబ్ల్యూఎంసీ నిరంతరం కృషి చేస్తోంది.