పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 21
ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదీయ్యా ముస్లిం కమ్యూనిటీ వరంగల్ నగరం ఆధ్వర్యంలో శాంతి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.నాయుడు పెట్రోల్ పంప్ ప్రాంతంలోని ఆర్టీఏ సర్కిల్ వద్ద కమ్యూనిటీ సభ్యులు గంటపాటు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ప్రపంచ శాంతి, మానవ సమాజంలో ఐక్యత, సామరస్యత, సోదరభావం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, ఘర్షణలు, హింస, ఆయుధ పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో శాంతి, న్యాయం, పరస్పర గౌరవం, మానవతా విలువల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.“మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపండి” అనే శాంతి సందేశాన్ని ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అందించారు.దేశాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం, సహనం, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.యుద్ధాలు, ఆయుధ పోటీలు ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, శాంతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ప్రపంచ శాంతి కోసం చేస్తున్న కృషిని నిర్వాహకులు ప్రస్తావించారు. శాంతి, న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా ప్రపంచ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన వివిధ సందర్భాల్లో వివరిస్తున్నారని తెలిపారు. వివాదాలకు సైనిక పరిష్కారాల కంటే న్యాయం, చర్చలు, పరస్పర అవగాహన ద్వారా శాంతియుత పరిష్కారాలను అన్వేషించాలని ఆయన సందేశాలను ఉటంకించారు.కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష ఆసక్తి కనిపించింది.పలువురు విద్యార్థులు కార్యక్రమాన్ని గమనించి అక్కడ ఆగి జమాఅత్ అహ్మదీయ్యా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మరికొందరు కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తీసుకున్నారు. శాంతి సందేశం పట్ల విద్యార్థులు ఆసక్తి, సానుకూల స్పందన వ్యక్తం చేయడం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసిందని నిర్వాహకులు తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో శాంతి కోసం కృషి చేయాలని, ద్వేషం, హింసకు దూరంగా ఉంటూ ప్రేమ, మానవత్వం, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు.అల్లాహ్ తఆలా ఈ ప్రయత్నాలను స్వీకరించి సమాజంలో శాంతి, ప్రేమ, సోదరభావాన్ని వ్యాప్తి చేయడానికి సాధనంగా చేయాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా, స్థానిక పట్టణ శాఖ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, సర్కిల్ ఇన్‌చార్జి ఆసిఫ్ ఖాదిం, పట్టణ మిషనరీ ఇన్‌చార్జి అయాన్ పాషా, స్థానిక వయోజన సమితి అధ్యక్షుడు ఇక్బాల్, సయ్యద్ కరీం, యువజన జిల్లా అధ్యక్షుడు కబీర్ పాషా, రఫీ, హమీద్, వలీపాష, బషీర్, అక్బర్, జీషాన్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.