పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26
హనుమకొండ: క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేం దర్ రెడ్డి అన్నారు.వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ – జూనియర్ బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాలతో పాటు ఇండియా యూత్ అండర్-18 సెలెక్షన్ ట్రయల్ క్యాంప్ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్దన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు,నగర పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది యువతకు ఉపయోగపడేలా, భవిష్యత్తులో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసే విధంగా క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులంతా కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన నిధుల మంజూరుకు తక్షణమే చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.స్టేడియం అభివృద్ధిని కేవలం ఒక క్రీడా మైదానంగా కాకుండా స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా సమగ్ర రూపకల్పన చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, గ్రామస్థాయి నుంచి ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కొద్దిమందికే పరిమితం కాకుండా, ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నత స్థాయికి ఎదిగేలా కింది స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని నగర పోలీస్ కమిషనర్ శ్వేత సూచించడం మంచి ఆలోచన అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అన్నారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విద్య, వైద్యం తర్వాత క్రీడలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే క్రీడా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత పెరిగిందని, అందుబాటులోకి వస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని వరంగల్‌ను క్రీడా రంగంలో ముందంజలో నిలపాలని అన్నారు.వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించి, ప్రతిభావంతులైన యువతకు అవసరమైన శిక్షణ, వసతులు అందించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, యువత క్రీడలను తమ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మలుచుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.