Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 11:34 am Posted by : Bommala Kumar

మర్కోడులో ఘనంగా కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

అవాజ్ న్యూస్ | సెప్టెంబర్ 06 | ఆళ్లపల్లి

ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
గ్రామ సర్పంచ్ సుతారి రమాదేవి, ఉప సర్పంచ్ వగలబోయిన సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల ఇందు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వాసం శ్రీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల ఆధారంగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, వరికి బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.